శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఆర్‌పీ - 3, 3ఏ ఇంక్లైన్లో ఇవాళ జరిగిన ప్రమాదంపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన కార్మికులకు కంపెనీ తరఫున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని అధికారులను సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. కార్మికుని మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారి లేని లోటును తీర్చలేకపోయినా.. బాధిత కుటుంబాలకు యాజమాన్యం అండగా ఉంటుందని సీఎండీ శ్రీధర్ భరోసా కల్పించారు.