Revanth Reddy On Nallala Odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరు పార్టీలో చేరిన అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరన్న రేవంత్... ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తోందని తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
"తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం. ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకం. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరు. ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తోంది. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు." -- రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్
అంతకుముందు.... సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు. సోనియా దగ్గరకు నల్లాల ఓదెలు దంపతులను రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2009, 2014 ఎన్నికల్లో తెరాస తరఫున నల్లాల ఓదెలు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్‌గానూ పనిచేశారు.
ఓదెలు ప్రస్థానం: తెరాస ఆవిర్భావం నుంచి తెరాసలో కొనసాగారు నల్లాల ఓదెలు. పార్టీలో సాధారణ కార్యకర్తగా చేరిన నల్లాల ఓదెలు 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్‌పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాజీనామా చేసి 2010లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యే గెలుపొందడంతో ప్రభుత్వ విప్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.