తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకప్పుడు కళకళ... నేడు వెలవెల

దేవాలయానికి వెళ్లి సొంతంగా గృహం నిర్మించుకునే భాగ్యం కల్పించమని.. సంతోషంగా గడిపే జీవితం ఇవ్వమని భక్తులు మొక్కుకుంటారు. కానీ ఆ కాలనీవాసులు తమ ఊళ్లో దేవుడికే పూజ చేసుకునే భాగ్యం కల్పించమని కోరుతున్నారు. ఒకప్పుడు వైభవంగా పూజలందుకున్న రాముడు.. కళకళలాడిన దేవాలయం శిథిలమైపోతుంటే చూస్తుండలేకపోతున్నారు.

manchirial ramayalam
ramayalam, mcc ramayalam

By

Published : Mar 31, 2021, 2:14 PM IST

తమకు ఏ కష్టమొచ్చినా ఆ ఆలయంలోని రాములోరికి విన్నవించుకునే వారు ఆ కాలనీ ప్రజలు. కానీ ఆ రాముడికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. నిత్యం దీప, ధూప, నైవేద్యాలతో వెలుగొందిన ఆ రామాలయం నేడు శిథిలావస్థకు చేరింది. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన ఆ ప్రాంగణం, నేడు పొదలతో కప్పుకుపోతోంది. గతంలో ఆ ఆలయాన్ని చూసినవారెవరైనా.. నేడు చూస్తే రాముడికెంత కష్టం వచ్చిందా అనుకోకమానరు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ రామాలయం.

పూజలు లేక వెలవెల
శిథిలావస్థకు ఆలయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కర్మాగారం ఆవరణంలో ఉన్న రామాలయం అన్యాక్రాంతమయ్యే స్థితిలో ఉంది. ఒకప్పుడు వైభవంగా ఉన్న దేవాలయం నేడు కళావిహీనంగా మారింది. ఆలయం నిర్వహణను సంస్థ యాజమాన్యం పూర్తిగా నిలిపేసింది. పోనీ నిర్వహణ బాధ్యతలు స్థానికులకు అప్పగించారా అంటే అదీ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లకు పైగా నిత్యం పూజలందుకున్న రాములోరికి పూజలు నిలిచిపోతే అరిష్టం అంటున్నారు స్థానికులు.

అప్పటి ఆలయం..

మార్చి 29 1958న ఏసీసీ సిమెంట్​ కంపెనీ నిర్మాణం సమయంలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు రామాలయం నిర్మించారు. ఏటా ఘనంగా శ్రీరామ నవమి నిర్వహించేవారు. ఉత్సవాలను తిలకించేందుకు పట్టణ వాసులంతా వస్తుంటారు. కర్మాగారం ఏసీసీ నుంచి ఎంసీసీగా మారిన తర్వాత కార్మికుల విరాళాలతో నూతనంగా శివాలయం నిర్మించారు. ప్రస్తుతం సిమెంట్ కర్మాగారం మూతబడిన క్రమంలో ఆలయం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అర్చకులకు వేతనాలు చెల్లించడం లేదు. ఆలయ పరిసరాలు శిథిలావస్థకు చేరాయి. ఆలయం ఉన్న స్థలం కంపెనీది కానప్పటికీ గేట్లు వేసి లోనికి రానివ్వడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆలయాన్ని ప్రభుత్వానికి గాని స్థానిక కాలనీవాసులకు అప్పగిస్తే పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు.

కూలిపోడానికి సిద్ధంగా..
తుప్పల్లో జ్ఞాపకాలు

ఇప్పటికైనా స్పందించండి

సిమెంట్ కర్మాగారంలోని నివాస గృహాలలో జిల్లా అధికారులు, కలెక్టర్ నివాసం ఉంటున్నారు. నిత్యం ఆలయం ముందు నుంచే వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రామయ్యకు పూజ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరుతున్నారు.

పట్టించుకోండి

ఇదీ చూడండి:టీ పొడి అనుకొని ఎండ్రిన్​ వేసుకుని.. మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details