బండరాళ్ల కింద కొండచిలువలు కలకలం సృష్టించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది దర్శనమిచ్చాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట సమీపంలోని కొండపై ఉన్న బండరాళ్ల కింద కొండచిలువలను గ్రామస్థులు గుర్తించారు. గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై రామాలయ నిర్మాణానికి కావాల్సిన స్థల పరిశీలన కోసం గ్రామస్థులు వెళ్లగా ఈ దృశ్యం కనిపించింది.
గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పాములు పట్టే వ్యక్తితో వాటిని బయటికి తీశారు. ఒక్కో కొండచిలువ దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాములను సురక్షితంగా అడవిలో వదిలినట్లు అధికారులు వెల్లడించారు.