Public Opinion Program in Manchiryala District: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని శాంతి స్టేడియంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ కార్యక్రమం జరిగింది. 1974లో 306 హెక్టార్ల భూమిలో ఆర్కే 6 గని, అదే సంవత్సరంలో ఆర్కే 5 భూగర్బ గనినీ సింగరేణి ప్రారంభించింది. ఈ రెండు మైన్లు అటవీ భూ పరిధిలోనే ఏర్పాటు చేశారు.
గని రివైజ్డ్ ప్లాన్ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదించిన బొగ్గు గని ప్లానింగ్‌లో 2022 వరకు మాత్రమే 1.18 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. దీంతో గని విస్తరణకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పర్యావరణ అనుమతులు వస్తే ఆరో గని జీవిత కాలం మరో మూడు సంవత్సరాలు, ఆర్కే ఐదో గని ఏడేళ్లు పెరిగే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని గని విస్తరణకు అనుమతులు ఇవ్వాలని సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్ర పర్యావరణ శాఖలకు దరఖాస్తు చేసుకుంది. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వ్యక్తులు, అధికారులు, కార్మిక సంఘాల నుంచి అదనపు కలెక్టర్ అభిప్రాయాలను సేకరించి గని అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో పాటు ప్రభావిత గ్రామాల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాల్సిన అవసరముందని సూచించారు.