Pranahitha Pushkaralu 2022: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత నదికి తొలిసారిగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌తో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్ పుణ్యస్నానం ఆచరించారు. ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. 12 రోజుల కార్యక్రమం కావడంతో శాశ్వత ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.
మంత్రిగా కృష్ణ, గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనే అదృష్టం దక్కిందని ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద పవిత్ర మంత్రోచ్ఛరణల మధ్య నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పాలనాధికారి రాహుల్ రాజ్, అదనపు పాలనాధికారి వరుణ్ రెడ్డి... నదికి హారతి ఇచ్చి పుణ్యస్నానం ఆచరించారు.
కాళేశ్వరంలోనూ: త్రివేణి సంగమంగా పిలిచే కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు మెుదలయ్యాయి. ఆలయం నుంచి తీసుకెళ్లిన పూర్ణ కలశాలతో మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాలకు అర్చకులు పుష్కరుడి ఆవాహన కార్యక్రమం నిర్వహించారు. పంచ కళశాలతో పుష్కరుడికి ఆహ్వానం పలికిన అర్చకులు... ప్రాణహిత నదికి సారె చీర, ఒడి బియ్యం, పూలు, పండ్లు, పూజ ద్రవ్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా పుణ్యస్నానం ఆచరించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు... ప్రభుత్వాలని పలు సూచనలు చేశారు.