ఈయన పేరు నర్రా సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నివాసం ఉంటారు. ఎనిమిది పదుల వయసులో ఎన్నో పతకాలు సాధిస్తున్నారు. లక్సెట్టిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన తర్వాత శరీర దృఢత్వంపై శ్రద్ధతో వ్యాయామాన్ని ప్రారంభించారు.
తన మునిమనవలతో పరుగెత్తాలని ఆశతో పరుగును ప్రారంభించిన సత్యనారాయణ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పోటీల్లో పాల్గొన్నాడు. ఇటీవలే గుజరాత్, మలేషియా, ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొని 800 మీటర్ల పరుగులో మూడో స్థానం, 100 మీటర్ల పరుగులో రెండో స్థానం సాధించాడు.
80ఏళ్లయినా కుర్రాడే... బరిలోకి దిగితే అంతే
అతని వయసు అక్షరాలా ఎనిమిది పదులు. అయినా అతనిలో సత్తా తగ్గలేదు. కుర్రాళ్లకు ధీటుగా ఎన్నో పతకాలు సాధిస్తున్నాడు. 80 ఏళ్ల వయసులో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ దేశంలో అయినా సరే అద్భుత విజయాలు సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన నర్రా సత్యనారాయణ.
ప్రోత్సాహంచాలి
నేటి యువత మద్యానికి బానిసై విలువైన జీవితాలను కోల్పోతున్నారని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఉక్కు కండరాలు, బలమైన సంకల్పం కలిగి ఉండాలని ఆకాక్షించారు. ప్రతినిత్యం శాఖాహారం, పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్లనే మంచి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలని కోరారు. 80 ఏళ్ల వయసులో సత్యనారాయణకు ఉన్న పట్టుదల నేటి యువతలో ఉంటే భవిష్యత్తులో దేశం మహోన్నత శిఖరాలు అధిరోహిస్తుందనడంలో సందేహం లేదు. ఇవీ చూడండి: 'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్ కొట్టివేత