కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బాధితులు అధైర్యపడొద్దని అన్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు మహారాష్ట్రకు దగ్గర్లో ఉండడం వల్ల కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మంచిర్యాలలో సోమవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సేవలపై చర్చించినట్టు తెలిపారు. ఈ రెండు జిల్లాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. కరోనా బాధితులకు ఇచ్చే కిట్లు, పరీక్ష పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాలను కేసీఆర్కు దృష్టికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రాష్ట్ర వైద్య సేవల, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి వివరించామని తెలిపారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 450 ఐసోలేషన్ పడకలు ఉన్నాయని వెల్లడించారు.