ఆమె రాకతో అక్కడ సీనంతా రివర్సయ్యింది. పెళ్లి మండపంలో అప్పటి వరకు ఉన్న సందడంతా ఆవిరైపోయింది. ఎన్నో ప్రశ్నలతో బంధువులు నివ్వెరపోయారు. ఎందుకంటే.. అందరిలా తానూ.. ఆ పెళ్లికి వచ్చిన బంధువు కాదు. కనులారా పెళ్లి చూసి.. నాలుగు అక్షతలు వేసి.. వధూవరులన దీవించి.. వింధు ఆరగించి.. వెళ్లోస్తానని చెప్పిపోడానికి.. స్నేహితురాలు అంతకన్నా కాదు. పెళ్లి పీటలపై కూర్చుని కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధంగా ఉన్న వరుడు ప్రేమించి ప్రేయసి ఆమె.
మండపానికి వచ్చీరాగానే.. తనకు జరుగుతున్న మోసాన్ని బంధువులందరి సమక్షంలో వివరించింది ఆ యువతి. తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఇప్పుడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని.. కన్నీళ్లు పెట్టుకుంటూనే.. పెళ్లికొడుకును నిలదీసింది. ఆ యువతి మాటలు విన్న బంధువులంతా.. హవ్వా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు. వధువు తరఫు బంధువులు నిచ్ఛేశ్టులయ్యారు. ఇంకేముంది.. పాత తెలుగు సినిమాల్లోలాగా.. వరుడు మోసం తెలిసిన వధువు తరఫువాళ్లు మూడు తిట్లు, ఆరు శాపనార్థాలతో ఆ పెళ్లిని విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి గ్రామంలోని బీమా గార్డెన్లో చోటుచేసుకుంది.