తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యామ్నాయ మార్గాలపై మంచిర్యాల ఆర్టీసీ కసరత్తు - mancherial rtc alternate way of earning

కరోనా ప్రభావంతో ప్రభుత్వం విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఆదాయం పెరిగిన దాఖలాల్లేవు. మే 19 నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రజా రవాణాసేవలు పునరుద్ధరించినా కొవిడ్‌ నిబంధనల కారణంగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు జంకుతున్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

mancherial RTC alternate way of earning due to corona crisis
ప్రత్యామ్నాయ మార్గాలపై మంచిర్యాల ఆర్టీసీ కసరత్తు

By

Published : Jul 27, 2020, 1:58 PM IST

ఆదాయం పెంచుకునేందుకు మంచిర్యాల జిల్లా ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కార్గో సేవలను ప్రారంభించిన సంస్థ తాజాగా పార్శిల్‌, కొరియర్‌ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఛార్జీలను సగానికి సగం తగ్గించారు. బస్సులు పునరుద్ధరించి రెండు నెలలు గడిచినప్పటికీ పూర్తిస్థాయిలో ఆదాయం పుంజుకోకపోవడంతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించకపోవడంతో ఆదాయం భారీగా తగ్గింది. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు ధృష్టి పెట్టారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ప్రాంతాల నుంచి కార్గో బస్సుల సేవలను ప్రారంభించారు. పార్శిల్‌, కొరియర్‌ సేవలను మెరుగుపర్చేందుకు ముమ్మర కసరత్తు చేపట్టారు.

ప్రజలకు చేరువయ్యేందుకు గతంలో కంటే సగం మేరకు కొరియర్‌, పార్శిల్‌ ఛార్జీలను తగ్గించి ముమ్మర ప్రచారం చేపట్టారు. దీనికోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సిబ్బందిని ఏజంట్లను నియమించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. వారి ద్వారా సేవలను ముమ్మరంగా చేసి ఆదాయం పొందాలనే లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆర్టీసీకి ఆదాయం తగ్గిన పక్షంలో సిబ్బందికి కోతపడే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలోనూ అధికారులు శాయశక్తులా కృషిచేస్తున్నారు.

పార్శిల్‌ సేవలతో మెరుగుపడే అవకాశం

జిల్లాలో కరోనా కారణంగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడం లేదు. దీంతో భారీగా ఆదాయం తగ్గింది. దీన్ని మెరుగుపర్చేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల డిపోలో కార్గో సేవలను ప్రారంభించాం. పార్శిల్‌, కొరియర్‌ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సేవలను ప్రజలకు అందిస్తే పరిస్థితి కొంతమేరకు మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో పాటు ఆదాయం పెంచేందుకు అవసరమైన అన్ని రకాల పరిస్థితులను పరిశీలిస్తున్నాం. జిల్లాలో బస్సుల డిమాండ్లు ఉన్న ప్రాంతాలకు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదాయం పెంచడంలో సిబ్బందితో కలిసి సమైక్యంగా కృషిచేస్తున్నాం.

- మల్లేశయ్య, డిపో మేనేజర్‌, మంచిర్యాల

మంచిర్యాల డిపోలో జులై (1- 22వరకు) పొందిన ఆదాయ వివరాలు..

మొత్తం బస్‌స్టేషన్లు : 07

  • జులైలో తిరిగిన దూరం

6,56,254 కి.మీ.

  • జులైలో పొందాల్సిన ఆదాయం

రూ. 5.39 కోట్లు

  • ఇప్పటివరకు పొందిన ఆదాయం

రూ. 1.25 కోట్లు

  • లాక్‌డౌన్‌కు ముందు రోజుకు ఆదాయం

రూ. 20 లక్షలు

  • ఆర్టీసీకి కలిగిన నష్టం

రూ. 4.13 కోట్లు

ABOUT THE AUTHOR

...view details