తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమారుడి ప్రోద్బలంతో సేంద్రియ సాగు.. లాభాలు బాగు - son idea got father profits in agriculture

తరతరాలుగా అలవాటైన సంప్రదాయ వ్యవసాయం వారి వృత్తి... అందులో కష్టాలూ నష్టాలది పాత కథే. పెద్ద కుమారుడు బాగా చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ తల్లితండ్రులు పడే కష్టాన్ని చూసిన ఆ యువకుడు సాగులో కొత్తదారులు వెతికాడు. సేంద్రియ పద్ధతుల్లో నల్ల, ఎర్ర వరి రకాల సాగుపై అధ్యయనం చేశాడు. ఆ వివరాలు చెప్పి, సేద్యంలో మార్పు చేయమంటూ అమ్మానాన్నలకు హితవు పలికాడు. కుమారుడు చెప్పిన పంథాను వారు ప్రయోగాత్మకంగా అనుసరించారు. ఫలితం బాగుంది. మరింత విస్తరించారు. నవ్విన నాపచేనే పండింది. సాగు లాభాలు చూపింది. పలువురికి ఆదర్శంగా నిలిపింది.

మంచిర్యాలలో కుమారుడి ప్రోద్బలంతో సేంద్రియ సాగు
mancherial district farmer got profits with his son's idea

By

Published : Jan 3, 2021, 6:44 AM IST

ఔషధ గుణాలు మెండుగా ఉండే నల్లధాన్యం, ఎర్రధాన్యం వంటి దేశవాళీ వంగడాల సాగులో ప్రగతి ఫలాలు అందుకుంటున్నారు నందుర్క సుగుణ, నారాయణ దంపతులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన వీరు నల్ల, ఎర్ర వరి ధాన్యం రకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. సంప్రదాయ, రసాయన రహిత ఆహారం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వీరు పండించే ధాన్యానికి చుట్టుపక్కల గిరాకీ కూడా పెరిగింది. సుగుణ, నారాయణలకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మురళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు పవన్‌, ప్రశాంత్‌ చదువుకుంటున్నారు. మూడేళ్ల కిందట మురళి నల్ల, ఎర్ర వరి సాగుపై కుటుంబ సభ్యులతో చర్చించారు. అందుకు అవసరమైన సమాచారాన్ని అందించారు. పదెకరాల భూమి ఉన్న అతడి తల్లితండ్రులు మొదట 10 గుంటల భూమిలో కాలాబట్టి (నల్లధాన్యం) సాగు చేపట్టారు.

పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ

రసాయనాలకు అలవాటు పడ్డ నేల కావడంతో తొలి ఏడాది తక్కువ దిగుబడి వచ్చింది. తర్వాతి ఏడాది ఎకరం భూమిలో సాగుచేయగా 23 బస్తాలు, వానాకాలం సీజన్‌లో ఎకరాన్నరలో వేయగా 45 బస్తాల ధాన్యం చేతికందింది. అంటే 31 క్వింటాళ్లు. ధాన్యంతో పాటు వీరే మర పట్టించి కావాల్సిన వారికి బియ్యంగానూ విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.100 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ.10-15 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం మూడు ఎకరాల్లో ఎర్రవరి సాగు చేస్తున్నారు. నల్ల వరి 135 నుంచి 145 రోజులు, నవారా ఎర్రబియ్యం, రత్నజోడి వంటి రకాలు 110 నుంచి 120 రోజుల్లో కోతకు వస్తాయని, అన్ని వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకుంటాయని సుగుణ, నారాయణ చెబుతున్నారు. సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే చేపడుతున్నామని, రసాయనాలకు బదులుగా జీవామృతం, ఘన జీవామృతాల కోసం దేశవాళీ ఆవులను పెంచుతున్నామని వారు వివరించారు.

హేళన చేసినోళ్లే.. విత్తనాలు అడుగుతున్నారు

ఈ సాగు చేపట్టినప్పుడు పొరుగు రైతులు హేళన చేసేవారు. సేంద్రియ పద్ధతిలో నల్లధాన్యం సాగు చేస్తే దిగుబడి రాదని వాదించేవారు. అలా హేళన చేసిన వారే ప్రస్తుతం మా పంట చూసి, తమకూ విత్తనాలు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడెంతో సంతోషంగా ఉంది.

- సుగుణ, నారాయణ దంపతులు

ABOUT THE AUTHOR

...view details