Kharge Fires on Central Government: గాంధీ త్యాగం, నెహ్రూ పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాము ఏమీ చేయలేకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని విమర్శించారు. సింగరేణిని మూసేందుకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన జై భారత్ సత్యాగ్రహ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలు మూసివేస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. గాలిని అమ్మే శక్తి ఉంటే అది కూడా అమ్మేవారని ఎద్దేవా చేశారు. ప్రాణం కావాలంటే గాలి కొనుగోలు చేయాలనేవారని విమర్శించారు. కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వానికి దిశ చూపారు: అంబేడ్కర్ రాజ్యాంగం రచించి ప్రజా ప్రభుత్వానికి దిశ చూపారని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అంబేడ్కర్ లేకపోతే ఎస్సీలు, మహిళలు ఓటు హక్కు కోల్పోయేవారని వివరించారు. అన్ని వర్గాలకు అంబేడ్కర్ సమాన హక్కులు కల్పించారని వివరించారు. పేదలైనా, ధనికులైనా అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ప్రస్తుతం చాలా మంది అంబేడ్కర్‌ను మరిచిపోతున్నారని పేర్కొన్నారు.
పత్రికల్లో ప్రకటనలు ఇస్తే సరిపోదు:ఎస్సీల పేరు చెప్పుకుని కొందరు పబ్బం గడుపుతున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పేదల అవసరాలు తీర్చడం మాత్రం చేతకాదని విమర్శించారు. దళితుల కోసం కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని గుర్తు చేశారు. వారి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎస్సీల విషయమై పత్రికల్లో ప్రకటనలు ఇస్తే సరిపోదని మల్లికార్జు ఖర్గే తెలిపారు.