మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం కబ్జాలకు నిలయంగా మారింది. ఇక్కడ ప్రభుత్వ, సింగరేణి భూములు ఉండడం అక్రమార్కులకు కలిసివస్తోంది. అత్యంత విలువైన స్థలాలు ఇప్పటికే కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కబ్జాలు చేయడం.. అధికారులు కూల్చివేయడం పరిపాటిగా మారింది. తదుపరి చర్యలు లేకపోవడంతోనే జోరుగా కబ్జాలకు ఎగబడుతున్నారు. సింగరేణి యాజమాన్యం కన్నాల శివారుతో పాటు పట్టణంలోని పలు బస్తీల్లో ఉన్న సింగరేణి స్థలాలను ప్రభుత్వానికి అప్పగించింది. వీటిని కాపాడడంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విఫలం అవుతున్నారు. రాత్రిరాత్రే ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించడంతో అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆక్రమణలు భారీ స్థాయిలో జరిగినా ఇప్పటి వరకు నాలుగు కేసులు మాత్రమే నమోదు చేశారు.
ఇదీ కబ్జాల పరంపర
సింగరేణి కన్నాల శివారులో ఉన్న 47.36 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించింది. గతంలో ఇక్కడ కబ్జాదారులు న్యాయస్థానంతో పాటు మిషన్ భగీరథ స్థలాన్ని సైతం ఆక్రమించారు. ఈ ఆక్రమణలను ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.
ఇదీ పరిస్థితి..
కబ్జాలకు తెగబడుతున్న వారిపై కేసులు లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. సంఘాలు, మత సంస్థల పేరుతో చేస్తున్న కబ్జాలు పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ జోలికి రారనే సాకుతో ఖాళీ స్థలాలను ఎక్కడపడితే అక్కడ ఆక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండాలు పాతేస్తున్నారు. చోద్యం చూడడం అధికారయంత్రాంగం వంతవుతుంది.
- 112, 138, 139, 140, 170 సర్వే నెంబర్లలో సింగరేణి, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. కన్నాల బంగారు మైసమ్మ సమీపంలో 4 ఎకరాలు, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట షెడ్లు, సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట 8 గుంటల స్థలం, రాంనగర్‌లో అక్రమ నిర్మాణాలు, కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 5 ఎకరాలు, సుభాష్‌నగర్‌లో ఖాళీ స్థలం, షంషీర్‌నగర్‌లో అక్రమ ఇళ్ల నిర్మాణాలను తొలగించారు. వీటితో పాటు గంగారాంనగర్‌లో 20 గుంటల స్థలాన్ని రెవెన్యూ ఆధీనంలోకి తెచ్చారు. ఇలా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆక్రమణలను కొద్దిమేరకు అడ్డుకోగలుగుతున్నా ఎక్కడా కేసులు నమోదు చేయడం లేదు. నిర్మాణాలు ఎవరు చేస్తున్నారో వారిపై చర్యలు ఉండడం లేదు. కేసులు లేకపోవడంతో కబ్జాదారులు ఇంకా రెచ్చిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి.