భారీ వర్షాల కారణంగా మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని .. పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన సూచించారు. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
అంతకు ముందే మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పుట్టినరోజు వేడకలకు హజరుకావాలని మున్సిపల్ సిబ్బందికి వాట్సాప్ గ్రూపులో సందేశం పంపించారు. ఈ కార్యక్రమంకు సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్, బిల్ కలెక్టర్ శ్రవణ్‌లు గైర్హాజరయ్యారు. దీంతో నలుగురు సిబ్బందికి కమిషనర్ మెమో జారీ చేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నాయకులు కమిషనర్‌కి కేటీఆర్ అంటే ఇంత అభిమానమా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.