గతంలో ఇసుక రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్న భీమారం రెవెన్యూ యంత్రాంగం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం విమర్శలకు దారి తీసింది. రెవెన్యూ శాఖ ముఖ్య అధికారులు స్థానికంగా ఉండకపోవడం, ఉన్నవారు వాటిని అడ్డుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. క్వారీల్లో ఎక్కువగా నీరు నిలిచి ఉండటం వల్ల ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు గ్రామాల్లోని చిన్న, పెద్ద వాగుల్లోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా సేకరిస్తున్నారు. రాత్రివేళల్లో లారీల ద్వారా తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
నిల్వ చేసి తరలింపు..
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని అర్కెపల్లి శివారులోని వాగు, కొత్త చెరువు సమీపంలోని వాగు, మాంతమ్మ సమీపంలోని వాగు, నర్సింగాపూర్, బురుగుపల్లి వాగుల నుంచి ఇసుకను ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి జేసీబీల సహాయంతో లారీల్లో నింపి పట్టణాలకు తరలిస్తున్నారు. మరోవైపు స్థానిక అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఇసుకను అక్రమ రవాణాకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.