తాండూరు మండలం మాదారానికి చెందిన నడిపెల్లి సన్నిహిత అయిదో తరగతి నుంచి యోగా నేర్చుకుంటుంది. యోగాసనాలను క్షణాల్లోనే వేస్తుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. జాతీయస్థాయి పోటీల్లో మూడు సార్లు పాల్గొంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సార్లు వెండి పతకాలు, ఒకసారి బంగారు పతకం సాధించింది. ఏకపాదాసనం, నటరాజసనం, మురళీకృష్ణాసనం, ద్విపాసనం, పూర్ణఉష్ణాసనం, పూర్ణధనురాసం వేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. కఠోరమైన ఆసనాలను అబ్బురపరిచేలా వేస్తుంది. యోగా శిక్షకురాలు బోయ ఉమారాణి వద్ద శిక్షణ తీసుకుంటుంది.
జాతీయస్థాయిలో సత్తా..
మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజ్‌రోడ్‌కు చెందిన ఎర్రోజు సన ఏడో తరగతి చదువుతోంది. యోగా రాష్ట్రస్థాయి పోటీల్లో ఒకసారి వెండి పతకం, 2018, 2019లో రెండుసార్లు బంగారు పతకాలతో సత్తా చాటింది. 2017లో కోల్‌కతాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం దక్కించుకుంది. వృశ్చికాసనం, పద్మమయూరాసనం, ఫించమయూరాసనం, బకాసనం, భూమసనం, మురళీకృష్ణాసనం, నటరాజాసనం వంటి కఠినమైన ఆసనాలను క్షణాల్లో వేయగల నేర్పరి. శిక్షకుడు మండ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆసనాలను సాధన చేస్తుంది.