తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఆఖరి చూపు ఎలాగూ లేదు.. మరణాన్నైనా ధ్రువీకరించండి"

గోదావరి వద్ద బోటు ప్రమాదం జరిగి 10 రోజులు దాటింది. ఇప్పటికీ 15 మంది ఆచూకీ తెలియలేదు. తమ వాళ్లు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియక... వెలికితీసిన మృతదేహాలు కనీసం మహిళదా పురుషునిదా గుర్తించలేక.. బాధితులు తల్లడిల్లుతున్నారు. కళ్లముందే బిడ్డ ఉన్నా గుర్తించలేని పరిస్థితి ఆ తండ్రిది. చివరి చూపునకు నోచుకోలేని దీనస్థితి వారిది.

By

Published : Sep 25, 2019, 11:27 PM IST

"ఆఖరి చూపు ఎలాగూ లేదు.. మరణాన్నైనా ధ్రువీకరించండి"

"ఆఖరి చూపు ఎలాగూ లేదు.. మరణాన్నైనా ధ్రువీకరించండి"

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద... గోదావరి పర్యాటక బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బతికే అవకాశాల్లేవు కాబట్టి మరణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బాధిత కుటుంబాలు అధికారులను వేడుకుంటున్నాయి. ఈ ఘటన జరిగి 10 రోజులు దాటినా బోటు వెలికితీత ప్రయత్నాలు ముందుకు కదలడం లేదు.

ఈ నెల 15న గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యటక బోటు మునిగిన ఘటనలో ఇప్పటివరకూ 36 మృతదేహాలే లభ్యమయ్యాయి. 15 మంది పరిస్థితి ఏంటన్నదీ స్పష్టత లేకుండా పోయింది. పదో రోజు పోలవరం మండలం వాడపల్లి వద్ద ఓ మృతదేహం లభ్యమైంది. తొలుత మహిళ మృతదేహంగా భావించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తిగా దెబ్బతిని ఎముకల గూడుగా మారిన ఆ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. చివరకు అది పురుషుడి మృతదేహంగా తేల్చారు.

ఈ పరిస్థితుల్లో కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటికీ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు బోటు వెలికితీసే ప్రయత్నాన్ని చేయాలని లేదంటే మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుచేయాలని వేడుకుంటున్నారు. గతి లేని పరిస్థితిలో కొందరు బాధితులు గల్లంతైన వారి కర్మకాండలు జరిపేస్తున్నారు.

గోదావరి చెంతే కర్మకాండ

మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ.. తెలంగాణ ట్రాన్స్ కోలో ఎనిమిది నెలల క్రితం అసిస్టెంట్‌ ఇంజినీర్ ఉద్యోగంలో చేరింది. గోదావరిలో పాపికొండల విహార యాత్రకు వెళ్తూ బోటు ప్రమాదంలో మునిగిపోయింది. ఆమె మృత దేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. తండ్రి సుదర్శన్ తోపాటు కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్దే ఎదురు చూసీ చూసీ.. తమ సంప్రదాయం ప్రకారం 11 వ రోజు చేయాల్సిన కర్మకాండను ఈ ఉదయం నిర్వహించారు.

ఆగిన సహాయక చర్యలు

దేవీపట్నం వద్ద సహాయ బృందాలు దాదాపుగా వెళ్లిపోయాయి. కచ్చులూరు ఘటనా స్థలంలోనూ గాలింపు చర్యలు నిలిచిపోయాయి. గోదావరిలో మృతదేహం సమాచారం వస్తే దాన్ని మాత్రం వెలికితీసేందుకు కొందరు సిబ్బంది అక్కడే ఉన్నారు. అంతకుమించి అక్కడ ఎలాంటి సహాయక చర్యలు జరగడం లేదు. అటు అధికార యంత్రాంగం బోటును బయటకు తీసే అంశంపై పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం... బాధితులకు అంతులేని ఆవేదనను మిగులుస్తోంది.

ఇదీ చదవండి: 'దీన్​ దయాల్​ దేశం కోసం సర్వస్వాన్ని అర్పించారు'

ABOUT THE AUTHOR

...view details