తెలంగాణ

telangana

ETV Bharat / state

సిడ్నీలో తెలంగాణ వాసి మృతి.. స్వదేశానికి తరలించేందుకు సాయం కోసం ఎదురుచూపు - funds collection for getting back the dead body to India form Sydney

Young man died in Sydney: ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. కానీ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థితిలో నిలబడాలనే ఆశ. తన కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకోవాలనే తాపత్రయం. అందుకే బాగా కష్టపడి చదివాడు. తన ప్రతిభతో ఆస్ట్రేలియాలో మాస్టర్స్​ పూర్తి చేశాడు. మరికొంత కాలమాగితే.. ఓ మంచి ఉద్యోగం సాధించి తనలాంటి యువతకు ఆదర్శంగా నిలిచేవాడు. కానీ విధి అతనిపట్ల చిన్న చూపు చూసింది. దేశం కాని దేశంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెంది.. కన్నవారికి తీరని శోకం మిగిల్చాడు. నూతన సంవత్సరం వారికి కడుపుకోతను మిగిల్చింది. కానీ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. కన్న కొడుకును కడసారిగా చూసుకునేందుకు సహకరించాలని కోరుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

road accident in Sydney
సిడ్నీలో రోడ్డు ప్రమాదంలో మృతి

By

Published : Jan 6, 2022, 2:46 PM IST

Young man died in Sydney: దేశం కాని దేశంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన 27 ఏళ్ల కుమారుడి కడసారి చూపు కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది. అసలే నిరుపేద కుటుంబం.. ఆపై ఆర్థిక ఇబ్బందులు. తమ కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడి చదువుకుని.. త్వరలో మంచి కొలువు సాధించి ఉన్నత స్థానంలో ఉండాల్సిన కుమారుడు.. నిర్జీవంగా మిగిలాడని తెలిసి తల్లిదండ్రులు, తోబట్టువులు తల్లడిల్లిపోతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన 27 ఏళ్ల రాజు.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.

దాతల సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు

విధి వక్రించింది

రాజుకు చిన్నప్పటి నుంచి విదేశాల్లో చదువుకుని ఉన్నత స్థితిలో నిలబడాలని కల. కానీ అతనిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కొమురయ్య, కమలమ్మ.. గ్రామంలో ఓ చిన్న గిర్నీ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదాయం అంతంతమాత్రమే. రాజుకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. రాజుకు చదువు పట్ల ఉన్న అమితమైన ఇష్టమే.. అతనికి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎమ్​ఐటీలో మాస్టర్స్​ పూర్తి చేసేలా చేసింది. మాస్టర్స్​ పూర్తయ్యాక.. ప్రస్తుతం తాత్కాలిక వీసాపైన సిడ్నీలోనే ఉంటున్నాడు. మరి కొద్ది రోజులైతే మంచి కొలువు సాధించేవాడు. ఈ క్రమంలోనే.. విధి అతని జీవితంపై చిన్న చూపు చూసింది.

స్నేహితులను కాపాడేందుకు వెళ్తే

జనవరి 3 న అర్ధరాత్రి దాటాక.. క్వీన్స్​ల్యాండ్​లోని ఓ ప్రాంతంలో చిక్కుకుపోయిన తన స్నేహితులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు.. మరికొందరు స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి కంగారు అడ్డు రావడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాలపైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు.. గాయాలతో బయటపడ్డారు.

దాతల సాయం కోసం ఎదురుచూపు

ఈ క్రమంలో ప్రమాదంలో మృతి చెందిన రాజు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సి ఉంది. కానీ రాజు తల్లిదండ్రులు.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో మృతుడి స్నేహితులు కొందరు.. రాజు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు.. నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. దయార్ద్ర హృదయులు సాయం చేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అతని కుటుంబీకులు, బంధువులకు రాజును చివరిచూపు చూసేందుకు సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:DH Srinivas on Covid Third Wave : 'మూడో ముప్పు షురూ.. వాళ్లకి సెలవుల్లేవ్..'

ABOUT THE AUTHOR

...view details