తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 6:32 PM IST

Updated : Oct 30, 2019, 10:46 PM IST

ETV Bharat / state

'డెంగీ' తాండవం: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

'డెంగీ' మనిషిని వణికిస్తోంది. దవాఖాన రోగులతో నిండిపోయింది. ఎప్పుడు ఏ ఇంటి నుంచి మరణవార్త వినిపిస్తుందోననే భయం ప్రజల్లో నెలకొంది. ఇటీవలే న్యాయమూర్తి మృతివార్త మరువకముందే... ఒకే ఇంట్లో నలుగురిని డెంగీ కబళించడం కలచివేస్తోంది. మంచిర్యాలలోని శ్రీనగర్‌ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది.

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

పదిహేను రోజుల క్రితమే భర్త మృతిచెందాడు. తొమ్మిదిరోజుల క్రితం తాతయ్య మృత్యు ఒడికి చేరాడు. నాలుగురోజుల క్రితం కూతురు మరణించింది. వరుస మరణాలతో వణికిపోయిన ఆ కుటుంబంలో మరో విషాదం జరిగింది. ఇవాళే ఆ ఇంటి కోడలు సైతం అనంతలోకాలకు వెళ్లిపోయింది.

పక్షం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ‘డెంగీ’కి బలయ్యారు. మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన సోని డెంగీకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సోని 9నెలల గర్భవతికాగా మంగళవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెంగీ వ్యాధితో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూసింది. ఇటీవలే భర్త, కుమార్తె, తాతను డెంగీతో కోల్పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

తల్లిలేదు.. తండ్రిరాడు...

విషాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కుటుంబంలో మరో ఘటన చోటుచేసుకుంది. నిన్ననే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. వరుసగా భర్త, తాతయ్య, కూతురు మరణించడంతో బాధలో ఉన్న ఆ తల్లికి కొడుకు కాస్త ఊరటని భావించారందరు! కానీ అంతలోనే ఆ దేవుడికి కన్ను కుట్టింది. ఆ పసివాడికి తల్లిని దూరం చేశాడు

ఒకరి తర్వాత ఒకరుగా...

మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజగట్టు (30) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందారు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ నెల 20న రాజగట్టు తాత లింగయ్య (70) డెంగీ కారణంగా మరణించారు. ఆ బాధ నుంచి తేరుకుంటుండగానే రాజగట్టు కుమార్తె శ్రీ వర్షిణి (6) 4 రోజుల క్రితం డెంగీ బారినపడింది. దీపావళి రోజే చిన్నారి అసువులు బాయడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో డెంగీతో నలుగురు చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరు డెంగీతో పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

Last Updated : Oct 30, 2019, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details