Forest Department: రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే సాగుచేసుకుంటున్న పోడుభూముల జోలికి వెళ్లడం లేదని, కొత్తగా అడవిని నరికి ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని అటవీశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దండేపల్లి మండలం కోయపోచగూడలో జరుగుతున్న ఘటనలకు అటవీశాఖ అధికారులను బాధ్యులుగా చిత్రీకరించడం తగదు. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూములను స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే చట్టపరిధిలో అడ్డుకుంటున్నాం. కవ్వాల్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో 25 ఎకరాల పరిధిలో చెట్లు నరికి, చదును చేస్తున్న వారిని వద్దని వారించినందుకు అధికారులపై స్థానికులు దాడి చేశారు’ అని పేర్కొంది.
గత ఏడాది నవంబరు నుంచి కోయపోచగూడలో అటవీ భూమి ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతుండటంతో అక్కడి స్థానికులకు రెవెన్యూ, పోలీస్, అటవీ అధికారులతో పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించామని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సీపీ వినోద్‌కుమార్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణదారులను అడ్డుకుని చట్టపరిధిలో కేసులు పెట్టాల్సి వస్తోందని, కానీ కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానికులను రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.