నాన్నను చివరి చూపు చూసుకోలేకపోయామన్న ఆ కూతుళ్ల బాధ.. కట్టుకున్నవాడిని కడసారి చూడలేకపోయానని ఆ భార్య పడ్డ వేదన.. కన్నకొడుకు అంత్యక్రియలకు హాజరుకాలేకపోయానని గుండెలవిసేలా రోదించిన ఆ తల్లి.. ఇలా కుటుంబంలో అందరికీ కరోనా సోకడం వల్ల మహమ్మారికి బలైన కుటుంబ పెద్ద దహనసంస్కారాలకు కూడా హాజరుకాలేని దుస్థితి.
కనికరం లేని కరోనా.. కడచూపుకు నోచుకోనివ్వని మహమ్మారి
కరోనా వైరస్ దావానంలా వ్యాపిస్తోంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల మృతి చెందిన ఓ వ్యక్తిని అతని కుటుంబం కడసారి చూసుకోలేకపోయింది. చివరి చూపుకు కూడా నోచుకోలేని దుస్థితిలో హౌంఐసోలేషన్లోనే వారంతా.. కుమిలికుమిలి ఏడ్చారు. వారిని ఓదార్చే పరిస్థితి కూడా లేకపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్‌రోడ్డు కాలనీలో ఓ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈనెల 15న కుటుంబ యజమాని మొదటగా వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత అతని తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, 6 నెలల మనవరాలికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం రోజు ఉదయం కుటుంబ యజమానికి శ్వాస సమస్యలు తలెత్తడం వల్ల కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం ఉదయం మృతి చెందాడు. ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో మృతుడి సొంతూళ్లోని శ్మశానవాటికలో వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబమంతా క్వారంటైన్లో ఉండటం వల్ల చివరిచూపు కూడా చూసుకోలేకపోయారు.
ఇదీ చదవండి:మినీ పోల్స్: ప్రచారంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు