చదరంగం ఆడాలంటే మేథస్సు, ఓపిక ఎంతో అవసరం. అలాంటి ఆటలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆకాశ్‌కుమార్ సత్తా చాటుతున్నాడు. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు మండలం రేపల్లెవాడకు చెందిన లక్ష్మి, సమ్మయ్య దంపతుల కుమారుడు ఆకాశ్. సమ్మయ్య ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆకాశ్ నాలుగో తరగతిలో ఉన్నప్పుడే.. తండ్రి చదరంగం ఆటను పరిచయం చేశారు. ఆ ఆటలో ఉన్న మాధుర్యాన్ని చవిచూసిన ఆకాశ్.. చెస్‌పై మక్కువ పెంచుకున్నాడు.
ఆ తర్వాత ఐదో తరగతి కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరాడు. ఆకాశ్ కుమార్ ఐదో తరగతి చదువుతున్న క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 2019లో అకాడమీలను స్థాపించింది. వివిధ క్రీడలకు సంబంధించి 24 అకాడమీలను ఏర్పాటు చేశారు. ఆకాశ్ ఎంపిక కావడంతో హైదరాబాద్ షేక్ పేటలోని అకాడమీలో చేరారు. విద్యతోపాటు చదరంగంలో తర్ఫీదు తీసుకున్నాడు. రాష్ట్రస్థాయి చదరంగం పోటీలతో పాటు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటిన ఆకాశ్ కుమార్.. అంతర్జాతీయ ఛాంపియన్ షిప్‌లోనూ ప్రతిభ కనబర్చాడు.