Pipeline Leakage: రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడో చోట గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడుతూనే ఉంది. నాసిరకం పైపులతో లైన్లు వేయడంతో నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక.. పైపులు పగిలి.. నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. ఆ నీరేదో బీడు భూముల్లోకి పారినా బాగుండేది. కానీ కోతకు వచ్చి నోటిదాకా రాబోతున్న పంటపొలాల్లోకి చేరడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని విలపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పగిలి రెబ్బెనపల్లి, చెల్కగూడ గ్రామ శివారులో మరోమారు పంటపొలాలు నీటమునిగాయి. వరదను తలపించేలా పెద్దఎత్తున నీటి ప్రవాహం కొనసాగింది. ఈ వరద నీటితో దాదాపు పదిహేను ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట నీటి మునిగింది. దీంతో రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.
ఎత్తిపోతల పథకంలో నాసిరకమైన పైపులు వేయడంతో ప్రతీ సంవత్సరం పైపులు పగిలి పంటలు నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలా పంటలు దెబ్బతిన్నాయని.. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటిదాకా రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన పైపులు వేసి నష్టపోయిన పంటపొలాలు సర్వే చేసి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.