సీపీఐ సీనియర్ నాయకుడు, శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మల్లేశ్ జులై 14, 1947లో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో జన్మించారు. హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తొలిసారిగా 1978లో పోటీ
తొలిసారిగా 1978లో అప్పటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సీపీఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 1983, 1985, 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి గెలుపొందారు. 2014లో తెరాస నేత దుర్గం చిన్నయ్య చేతిలో ఓడిపోయారు. 2018లోనూ ఓటమి చవిచూశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవితమంతా సీపీఐలోనే కొనసాగింది.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ మల్లేశ్ చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్షనేతగా తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. తెలంగాణకు మద్దతుగా ఎన్నో పోరాటాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలకు తెరాస అధినేత కేసీఆర్‌తో కలిసి సీపీఐ శాసనసభ పక్షనేత హోదాలో పలుమార్లు హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించారు.
లారీ క్లీనర్‌గా జీవితం ఆరంభించి
లారీ క్లీనర్‌గా జీవితం ఆరంభించిన మల్లేశ్ సీపీఐ శాసనసభ పక్ష నేతగా ఎదిగారు. పేద ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశారు. నిరాడంబరంగా జీవించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లేశ్ ఏనాడు హంగూ ఆర్భాటాల జోలికి పోలేదు. నిజమైన కమ్యూనిస్టు నాయకుడిగా వ్యవహరించారు. కుమార్తెలు, కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అత్యంత సామాన్యంగా జీవించిన మల్లేశ్ చనిపోయే ముందు కూడా కార్పొరేట్ ఆస్పత్రిలో కాకుండా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నిజమైన కామ్రేడ్‌గా నిలిచారు.
ఇదీ చదవండి:సింగరేణి కార్మికులకు శుభవార్త... దసరా వేళ బోనస్ కానుక