బెల్లంపల్లి కొవిడ్ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. 36 గంటల్లో 12 మంది వైరస్‌కు బలవ్వడం అక్కడి వారిని తీవ్రభయాందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు ఇదొక్కటే కరోనా ఆస్పత్రి. ఇక్కడ గత నెలరోజుల్లో 31 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులంతా తొలుత ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారని... అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో చివరి క్షణాల్లో తీసుకురావడంతో కాపాడలేక పోయామని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ అనిల్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఎనిమిది మంది... ఆ తర్వాత మరో నలుగురు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు.
మళ్లీ తిరగబెడుతున్న కరోనా
బెల్లంపల్లి కొవిడ్ ఆస్పత్రిలో 100 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటిలో ప్రస్తుతం 70 మంది చికిత్స పొందుతున్నారు. అదనంగా ఐసీయూలో 20 పడకలు ఉండగా.. 12 మందికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా చనిపోయిన వారంతా గత రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఇక్కడ చేరారు. చెన్నూరుకు చెందిన పి.వీరేశం(65) ఏప్రిల్ 22న బెల్లంపల్లి కొవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక డిశ్ఛార్జి అయి వెళ్లిపోయారు. కరోనా మళ్లీ తిరగబెట్టడంతో ఈ నెల 2న ఆస్పత్రిలో తిరిగి చేరారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.