జిల్లాలో వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి అధికారులు గ్రామీణ స్థాయిలో సర్వే చేస్తున్నారని జిల్లా పాలనాధికారి భారతీ హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధి సోకుతున్నట్లు సమాచారం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి.. వారి ఎడమ చేతిపై తేదీతో కూడిన స్టాంప్ వేస్తామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి రహదారి మార్గంలో జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున.. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.