CM KCR Mancherial Tour Today : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడిపేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ.500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశిస్తూ కేసీఆర్ కాసేపు మాట్లాడారు. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్న కేసీఆర్.. సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.
'పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురు ఆఫీసర్లను పెంచడం కాదు. సంస్కరణ అనేది ఒక రోజుతో అంతం అయ్యేది కూడా కాదు. ఇది నిరంతర ప్రక్రియ. సంస్కరణలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. ఆసిఫాబాద్ కలెక్టరేట్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైంది. దేశంలో నోట్ల రద్దు భయంకరమైన పరిస్థితి. సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నాం. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. యాదవులకు గొర్రెల పంపిణీ విజయవంతంగా చేపట్టాం. 3.8 లక్షల మందికి రెండో విడత గొర్రెల పంపిణీ.'-సీఎం కేసీఆర్