లాక్‌డౌన్‌తో మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మేకల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా ఉన్న మేకల ధరలు పెరగడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు సీసీసీకి చెందిన కొంతమంది యువకులు పశువుల దొంగతనాలకు తెర లేపారు. గతంలో వీరు ఈ కేసుల్లో నిందితులే. పశువుల మాంసానికి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో అటవీ జంతువుల మాంసం పేరుతో వీటి విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పశువు ధర మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటే దొంగలు వీటి మాంసం ద్వారా పొందుతున్నది రూ.10 వేలు మాత్రమే కావడం గమనార్హం.
ఆందోళనలో సంరక్షకులు..
జిల్లా కేంద్రంలో నెలరోజుల వ్యవధిలోనే పదికి పైగా పశువులు చోరీకి గురయ్యాయి. వరుస ఘటనలు పశువుల యజమానులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల స్థానిక గోపాల్‌వాడ ప్రాంతంలోనే పదికిపైగా పశువులు అపహరణకు గురయ్యాయి. పశువులను దొంగలు తీసుకువెళ్తున్న దృశ్యాలను కొందరు తమ చరవాణులలో నిక్షిప్తం చేశారు. ఈ వీడియో దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయం, ఇతరాత్ర అవసరాల కోసం పశువులను పెంచుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
2017 సంవత్సరంలో సీసీసీలో జరిగిన చోరీలో 11 పశువులు, మంచిర్యాలలో పశువులు అపహరణకు గురైన కేసులు నమోదయ్యాయి. 2018లో కోటపల్లిలో ఒకటి, మంచిర్యాలలో పది పశువులు దొంగతనం జరిగినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. తర్వాత పలు ప్రాంతాల్లో పశువులు చోరీలు జరిగినా ఫిర్యాదులు లేకపోవడంతో కేసులు నమోదు కాలేదు.