కేంద్రం రైతుల అభ్యున్నతి కోసమే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతోన్న అన్నదాతల ఆదాయాన్ని పెంచడమే ప్రధాని మోదీ లక్ష్యమని వారు పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా ఎదుగుతూ.. వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా.. కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చేలా చేయడమే.. చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
1991లో పారిశ్రామిక రంగంలో జరిగిన సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందిందని వాదిస్తోన్న కాంగ్రెస్.. స్వార్థ రాజకీయంతో వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తోందన్నారు. అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే తమ ఉనికికే ప్రమాదమని టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, భావిస్తున్నట్లు తెలిపారు. వామపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ మార్కెట్ సంస్కరణలకు అనుకూలమని చెప్పి, నేడు వ్యతిరేకిస్తోన్నాయని గుర్తు చేశారు.