జీవితంలో పెళ్లి అంటే మాటలకందని మధురానిభూతి.. వివాహ ఘట్టంలో ప్రతి క్షణం ఆ దంపతుల మనోపలకంలో సువర్ణ అక్షరాలుగా నిలిచిపోతుంది. అందుకే ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో ఒకేసారి వచ్చే ఈ పండుగను మహదానందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు... కోటి ఆశలతో తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంలో వారి సంతోషం వారి కల్లలోను.. ప్రతి చేష్టలోను కనిపిస్తుంటుంది. అయితే మనువాడబోయేవాడిపై తనకున్న ఇష్టాన్ని ఓ వధువు డ్యాన్స్ రూపంలో బయటపెట్టింది.
మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీశాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రీయను... రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14న వివాహం జరిపించారు. వివాహనంతరం పెళ్లి బరాత్ మొదలైంది. పెళ్లి కొచ్చిన అతిథిలు, స్నేహితులు డ్యాన్స్ చేశారు. అప్పుడు మొదలైంది అసలు ట్విస్ట్. తన జీవితంలోకి వచ్చినవాడిపై ఇష్టాన్ని, కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని, అత్తింట్లో తన పాత్రను వివరిస్తూ " బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా..." పాటకు డ్యాన్స్ చేసి సర్ప్రైజ్ చేయడమే కాకుండా... మనువాడిన వాడి మనసు దోచుకుంది.
నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్ అధికారి పి.నరహరి ట్వీట్ చేశారు. గాయని మోహన భోగరాజును ఆయన ట్యాగ్ చేయగా.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.