Students Beer Party: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మాంసం, మద్యంతో విందు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. చర్చనీయాంశంగా మారింది. హస్టల్లోని పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు కలిసి ఆదివారం(ఏప్రిల్ 17న) రాత్రి వీడ్కోలు పార్టీ చేసుకుంటామని వార్డెన్‌ను కోరారు. పిల్లల కోరికను మన్నించిన వార్డెన్.. వంటమనిషి విజయ చేత రాత్రి పూట భోజనంలోకి చికెన్ చేయించారు. విద్యార్థులందరూ.. భోజనం చేసిన తర్వాత సుమారు తొమ్మిదిన్నర సమయంలో వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు. వంటమనిషి విజయ.. హస్టల్లోనే పక్కన గదిలో పడుకుంది.
అప్పుడు హాస్టల్లోని విద్యార్థులు.. బయట మిత్రులతో హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ కూర్చొని చికెన్‌తో పాటు మద్యం సేవించారు. అయితే విద్యార్థులు మద్యం సేవిస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను.. కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో విషయం బయటపడింది. ఆ ఫొటోలు కాస్తా.. వైరల్ కావటంతో అధికారుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ భాగ్యమతి.. హాస్టల్లోని విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల ముందే.. పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.