తెలంగాణ

telangana

ETV Bharat / state

AMBULANCE: అంబులెన్స్​లో గర్భిణీ.. బురదలో చిక్కుకున్న వాహనం.. ఏమైందంటే..? - An ambulance stuck in the mud in mancherial district

ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీలకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవ వేదన కంటే.. 'రవాణా సౌకర్య వేదన' వారిని ఎక్కువగా ఇబ్బందిపెడుతోంది. తాజాగా ఓ నిండు గర్భిణీని తరలిస్తున్న అంబులెన్స్ వాగు వద్ద​ బురదలో చిక్కుకుపోయింది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో స్థానికులు అండగా నిలిచారు. తలో చేయి వేసి వాహనాన్ని వాగు దాటించి.. రెండు నిండు ప్రాణాలను కాపాడారు.

AMBULANCE: అంబులెన్స్​లో గర్భిణీ.. బురదలో చిక్కుకున్న వాహనం.. ఏమైందంటే..?
AMBULANCE: అంబులెన్స్​లో గర్భిణీ.. బురదలో చిక్కుకున్న వాహనం.. ఏమైందంటే..?

By

Published : Sep 2, 2021, 7:37 PM IST

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం గ్రామానికి చెందిన బురుస శిరీష అనే మహిళకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో చెన్నూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

బురదలో చిక్కుకున్న అంబులెన్స్ వాహనం

వైద్యుల సలహా మేరకు శిరీషను అంబులెన్స్​లో చెన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. గొర్లపల్లి వాగు వద్ద వాహనం ఆగిపోయింది. బురదలో చిక్కుకుపోయింది. దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి.. సమీపంలోని నీల్వాయి గ్రామ సర్పంచ్​, మరికొంత మంది యువకులు అండగా నిలిచారు. అంబులెన్స్​లో ఉన్నవారిని కిందకు దింపి.. అతి కష్టం మీద అంబులెన్స్​ను ఒడ్డుకు చేర్చారు. నిండు గర్భిణీని చేతుల మీద మోస్తూ వాగు దాటించారు. అనంతరం అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న మరో అంబులెన్స్​​లో శిరీషను చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గర్భిణీని చేతులపై వాగు దాటిస్తున్న దృశ్యం

వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో శిరీష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గొర్లపల్లి వాగు వద్ద అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శిరీష

ఇదీ చూడండి: karvy: కార్వీ కేసులో మరో ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details