తన భార్యను కాపురానికి పంపించాలని మంచిర్యాలలోని జన్మభూమి నగర్లో అత్తగారింటి ముందు భర్త మౌన పోరాటం చేయడం సంచలనంగా మారింది. సాయితేజ నివాస గృహ సముదాయంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోన్న భార్య లేఖశర్మ ఇంటి ముందు భర్త ఒరిగంటి రాంకరణ్ మౌన పోరాటం చేశారు.
భార్యను కాపురానికి పంపించాలంటూ భర్త మౌనపోరాటం - husband protest
భర్త కోసం దీక్షలు, పోరాటాలు చేయటం ఇన్ని రోజులు భార్యల వంతైంది. ఇప్పుడు ఓ భార్యా బాధితుడు తన అర్థాంగి కోసం మౌనపోరాటం చేస్తున్నాడు. ఈ విచిత్ర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం జన్మభూమి నగర్లో జరిగింది. తామిద్దరి మధ్య అత్త, మామలే గొడవలు పెడుతున్నారని ఆ భర్త ఆరోపిస్తున్నాడు.
రాంకరణ్, లేఖ శర్మ ఓకే పాఠశాలలో చదువుకొని, ప్రేమించుకొని 2014 లో పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగుతున్న దాంపత్య జీవితంలో వారిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లేఖ శర్మ తన తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తోంది.
తమ ఇద్దరి మధ్య అత్త, మామ మనస్పర్థలు తీసుకొస్తున్నారని రాంకరణ్ ఆరోపించాడు. వారి వల్లే గొడవలు పెరిగి తన భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిందని తెలిపాడు. తన భార్యకు కౌన్సిలింగ్ ఇస్తే తనతో వస్తుందని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ఇక్కడే మౌన పోరాటం కొనసాగిస్తానన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.