All Rounder Jahnavi: మంచిర్యాలకు చెందిన సుజాత, మురళి దంపతుల ఏకైక కుమార్తె జాహ్నవి. స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చిన్నతనం నుంచే జాహ్నవి పాటలు పాడడంలో ఆసక్తి చూపడంతో.. తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అలా పాటలు పాడటం ప్రారంభించిన ఆమె ప్రస్తుతం 17 భాషల్లో పాటలు పాడుతోంది. తెలుగు, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, మరాఠీ... తమిళ్, నేపాలి, కన్నడ, ఒరియా, ఉర్దూ... హిందీ, బెంగాలీ, లంబాడి, మలయాళం, దక్షిణాఫ్రికా భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతోంది.
2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరబ్ దేశాలలో పర్యటించినప్పుడు మన జాతీయ గీతాన్ని అరబ్ భాషలో అక్కడ ఆలపించారు. అరబ్‌లో పాడిన పాటలను విని జాహ్నవి నేర్చుకుని పాడుతోంది. ఆన్లైన్లో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అంతేకాకుండా ఆమె ఎంతో చక్కగా హార్మోనీయంను వాయిస్తోంది. తన నాలుగో ఏటే వేదికపై వివిధ అంశాల్లో ప్రదర్శన ఇచ్చింది. చిన్నప్పటి నుంచే నృత్యం చేసేది.. పాటలు పాడేది, డైలాగులు చెప్పేది, మిమిక్రీ చేసేది. ఎక్కడ ఏ పోటీల్లో పాల్గొన్నా ప్రథమ బహుమతి సాధించేది జాహ్నవి.
మిమిక్రీలోనూ రాణిస్తూ..
బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన బాలోత్సవ్ 2021 పాటల పోటీలో జాహ్నవి పాల్గొని ప్రథమ బహుమతి సాధించింది. ప్రథమ బహుమతి సాధించిన ఆమెకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించి ప్రదానం చేశారు. వరుస మూడేళ్లుగా జాహ్నవి బాలోత్సవ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధిస్తోంది. జాహ్నవి పాటలతో పాటు మిమిక్రీ అదరగొడుతోంది. రాజకీయ నాయకుల్లా డైలాగులు చెబుతుంది. ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక సినిమాల డైలాగులను అద్భుతంగా చెబుతోంది. పాంచాలి... పంచభద్రుక... అంటూ దుమ్ము దులిపేస్తోంది.