మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన ఉపారపు పెద్దులు(60), రాజవ్వ (55) దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు నరేశ్ (18) రెండు కాళ్లు పని చేయకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. మూడో కొడుకు నవీన్ వయసు 13 సంవత్సరాలు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేశాడు.
ఏళ్లుగా పెండింగ్లోనే...
రాజవ్వకు నాలుగేళ్ల నుంచి కాళ్లు పనిచేయట్లేదు. కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు ఒక కిలోమీటరు దూరం గెంతుతూ వెళ్లి రేండ్లగూడ ప్రధాన రహదారి పక్కన మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతుంది. కూలి పనులు చేసే కుటుంబ యజమాని పెద్దులు... పక్షవాతం బారిన పడ్డాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు రూ.200 పింఛను వచ్చేది. ఆ తర్వాత నిలిచిపోయింది. ఏడాదిన్నర కిందట పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. జిల్లా పాలనాధికారి వద్దకు సైతం వెళ్లారు. అయిన ఫలితం లేకుండా పోయింది. ఎంపీడీవో కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉంది.