COUPLE MARRIAGE IN HOSPITAL: పెళ్లి అంటేనే ఆ హడావుడి వేరు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి వచ్చిన పెద్ద వేడుక. పెళ్లిని ఎంతో గొప్పగా చేసుకోవాలని కలలు కంటారు. ఏర్పాట్లకు ఎక్కడ వెనుకాడరు. పెద్ద పెద్ద మండపాలు, మామిడి ఆకుల తోరణాలు, భాజ భజంత్రీలు, ప్రస్తుత రోజుల్లో డీజే సౌండ్ లేనిదే పెళ్లి కొడుకు అసలు తాళే కట్టనని మారం వేస్తాడు. కొత్త నగలు, పట్టుచీరలు కట్టుకొని మన బంధువులు చేసే ఆ ఆర్భాటమే వేరు. కానీ మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఇవన్ని అవసరం లేదని నిరూపించాడు. తనకు కాబోయే భార్య శస్త్రచికిత్స చేయించుకొని ఆసుపత్రిలో ఉన్నా సరే తాళికట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అవును మరచిపోయాను ఇందులో పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా ఆ ఆసుపత్రి వైద్యులేనండి.
ఇది జరిగింది: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలానికి చెందిన బానోథ్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయం అయ్యింది. గురువారం లంబాడిపల్లిలో వారి ఇరివురికి పెళ్లి జరగవలసి ఉండగా.. వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
దీంతో వైద్యులు ఆమెకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించడంతో ఇన్ పేషేంట్‌గా ఉండిపోయింది. విషయం వరుడు తిరుపతికి తెలియడంతో ఎంతో బాధపడ్డాడు. ఓ వైపు ఇరు కుటుంబాలకు చెందిన వారు పేదలు కావడంతో మరోసారి పెళ్లి ఏర్పాట్లు చేయడం అంటే ఖర్చు ఎంతో అవుతుందని భావించారు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో తిరుపతి ఇరుకుటుంబ సభ్యలను ఒప్పించాడు.
వైద్యులే పెళ్లి పెద్దలు: శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయము చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెళ్లి పెద్దలుగా మారారు. బెడ్‌పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేశాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెళ్లి ఆసుపత్రిలో పెళ్లికి అనుమతి ఇచ్చినట్లు ఆసుపత్రి డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. శైలజకు బుధవారం ఆపరేషన్ చేశామని.. త్వరలోనే ఆమెను డిఛార్జ్ చేస్తామని తెలిపారు.