మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిమల్ల రాజగట్టు కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందాడు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగీతో మరణించారు.
ఇద్దరి మరణాలను తలచుకొని తలుచుకొని బాధపడుతున్న ఆ కుటుంబంలో దీపావళి రోజే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కుమార్తె ఆరేళ్ల వర్షిని నాలుగు రోజుల క్రితం డెంగీ బారిన పడి మృతి చెందింది. తాతను, భర్తను, కూతురును పోగొట్టుకున్న రాజు భార్య సోనీ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. మూడు రోజులుగా ఆమె కూడా డెంగీతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో కుమార్తె వర్షిని అంత్యక్రియలు ముగించగానే ఆమెను ఆస్పత్రికి తరలించారు.