రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఓ గ్రామంలో మూడు రోజుల్లో 28 మందికి కొవిడ్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ఊరిలో కరోనా టెస్టులు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు మూడు రోజుల్లో 28 కొవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 26వ తేదీన ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మరుసటి రెండు రోజుల్లో 23 మందికి వైరస్ సోకింది. వైద్య సిబ్బంది మూడు రోజుల నుంచి గ్రామంలో మకాం వేసి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ సోకిన వారంతా ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోన్న కేసులు
గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమంటున్నారు వైద్యారోగ్య అధికారులు. మాస్కులు ధరించకపోవడం, శానిటైజర్ వాడకపోవటం వల్ల కొవిడ్ వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు. జ్వరం వస్తే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన వారు ఇంట్లో కూడా మాస్కు ధరించాలన్నారు.