రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పనితీరుపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ.. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలపలేకపోయారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మర్రి శశిధర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశాలకే పరిమితం కావొద్దు..
రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ఆరా తీసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ బలోపేతానికి నాయకులు అంత కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. కొందరు నాయకులు మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసేటప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం నిర్దిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించకుండా పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా అమలయ్యేలా చూడాలన్నట్లు తెలుస్తోంది.