womens nude photos scam in mahabhubnagar: పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఇంతకీ దందా ఏమిటంటే ముందుగా తాము ఎంచుకున్న మహిళతో డబ్బు ఎర చూపి మాటలు కలుపుతారు. ఎదో రకంగా ఆమెను ఒప్పుకునేలా మాయ మాటలు చెప్పి నగ్న చిత్రాలు కావాలంటారు వాటిని హైదరాబాద్లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మిస్తారు.
పూజకు ఎంపికైతే కోట్లు సంపాదించవచ్చు. కానీ అందుకు ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్నఫొటోలు ఇవ్వాలి. అలా మాయ మాటలు చెప్పి సుమారు 25 మంది అమాయక మహిళల నగ్నచిత్రాలు సేకరించిన ముఠాను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న జడ్చర్లలోని పాతబజారులో గొడవ జరుగుతుందని డయల్-100కు ఫోన్ కాల్ చేశారు. అక్కడి ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొదట జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ చిత్రాలు తీశారన్న ఆరోపణపై విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వనపర్తికి చెందిన జైనుల్లావుద్దీన్ జడ్చర్లలో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటు రాములు, శంకర్ అలీ, రాములు నాయక్ కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించి నగ్న చిత్రాలు సేకరిస్తున్నారు. నిరుపేద మహిళల్ని డబ్బు ఎరగా చూపి తమకు తెలిసిన గురువు ఉన్నారని.. ఆయన పూజకు ఎంపిక చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని ఆశచూపారు. పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతికి చెందిన నగ్నఫొటోలు తిరుపతి అనే వ్యక్తికి పంపాలని చెప్పారు.