కల్లు దుకాణాల్లో మహిళలను హత్యచేసి దోచుకునే దొంగ దొరికాడు కల్లు దుకాణాల్లోకి వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి... కళ్లు తాగించి అనంతరం హత్యచేసి ఆభరణాలు దోచుకునే పాత నేరస్థున్ని మహబూబ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న దేవరకద్ర మండలం డోకూరులో అలివేలు అనే మహిళ హత్య కేసును ఛేదించే క్రమంలో మరో 3 కేసులు వెలుగులోకి వచ్చాయి. బాలనగర్ మండలం గుండేడ్కు చెందిన ఎరుకలి శ్రీను ఈ హత్యలన్నీ చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
దోచుకున్న నగలు భార్యకే...
బూత్పూర్ మండలం కరివెన, కొత్తకోట మండలం అపరాల, మిడ్జిల్ మండలం కొత్తవాగులో జరిగిన మహిళల హత్యలు సైతం తానే చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. డోకూరు కేసులో రూ. 60వేలు, కొత్తవాగు కేసులో రూ.25వేలు, అపరాల కేసులో రూ.25వేల విలువైన ఆభరణాలను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు దొంగిలించిన సొమ్మును తన భార్య సాలమ్మకు ఇస్తుండేవాడని... ఆమెను సైతం ఏ2 నిందితురాలిగా చేర్చి అరెస్టు చేసినట్లు వివరించారు.
కల్లు, మద్యం దుకాణాలకు వెళ్లే మహిళలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. 2007లో సొంత తమ్మున్ని హత్య చేసిన కేసులో శ్రీను నేరస్థునిగా జైలు శిక్ష అనుభవించారన్నారు. మూడు కేసుల్లో నేరాలు రుజువయ్యాయన్న రెమా రాజేశ్వరి నిందితునిపై పీడీ యాక్టు నమోదు చేస్తన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది బ్యాంకుల సెలవులు ఇవే!