paddy farmers problems: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు కొనసాగుతోన్న వేళ రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరుచుకుంటాయా? లేదా? అన్న ఆందోళన నెలకొంది. యాసంగిలో వరి వేయొద్దని, ధాన్యం కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ముందే తేల్చి చెప్పింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ విస్తీర్ణానికి మించి 2 లక్షల 71 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కొన్నిచోట్ల తిండి గింజల కోసం, కొందరు పశు గ్రాసానికి, మరికొందరు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతుందా అనే ఆశతో వరిని సాగు చేశారు. గత యాసంగితో పోల్చుకుంటే వరి విస్తీర్ణం 40 శాతం వరకు తగ్గింది. అయినప్పటికీ.. పండిన పంటను ఎలా అమ్ముకోవాలన్న సందిగ్ధం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ఖర్చులు పెరిగి.. రాబడి తగ్గి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి 70 శాతం వరకు సన్నరకాలే సాగు చేశారు. దొడ్డు రకాలతో పోల్చితే.. సన్నరకాల దిగుబడి తక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో యంత్రాలకు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కూలీ పెరిగిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గాయని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే గిట్టుబాటయ్యే అవకాశం ఉందని.. లేదంటే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వమే క్వింటా రూ.1980లకు వడ్లు కొనుగోలు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం కొనకుంటే 'కష్టం'..
ఉమ్మడి పాలమూరులో గతేడు యాసంగిలో సుమారు 11.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఈసారి మాత్రం ఎక్కడా ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరచుకోలేదు. యాసంగిలో ముందస్తుగా వరి వేసిన రైతులు ఇప్పటికే కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది యాసంగిలో సుమారు ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సాధారణంగా జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని సరిహద్దు రైతులు కర్ణాటకలో ధాన్యం అమ్ముతారు. రాష్ట్రంలో మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో మూడేళ్లుగా అటు వైపు వెళ్లడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనకుంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.