కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువుకుంటే ముందుగా జులై నెలాఖరుకే వందశాతం ఓడీఎఫ్ సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచణ క్షేత్ర స్థాయిలో నీరుగారిపోతోంది. మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే పింఛన్ నిలిపేస్తాం.. బియ్యం ఆపేస్తాం.. కరెంటు తీసేస్తామంటూ ఎంత ఒత్తిడి తెచ్చినా లక్ష్యం సిద్ధించడం లేదు. వలసలు, పేదరికం, స్థలాభావం, మూఢనమ్మకాలు ఓడీఎఫ్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారు.
ఉన్న వారైనా వినియోగించడం లేదు
కనీసం మరుగుదొడ్డి నిర్మించుకున్నవారైనా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. కొందరు వాటిని స్టోర్రూముగా.. కట్టెలు దాచుకునేందుకు వాడుతున్నారు. గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లలో సుమారు 30 నుంచి 40 శాతం మంది వాటిని ఉపయోగించడం లేదు.
అసంపూర్తి నిర్మాణాలు
చాలాచోట్ల కాంట్రాక్టు పద్ధతిలో నిర్మాణం చేపట్టడం వల్ల వాటిని మొక్కుబడిగా నిర్మించారు. ట్యాంకులకు మరుగుదొడ్డికి కనెక్షన్ ఇవ్వలేదు. నిధులు వెచ్చించినా పనులు కాకపోవడం వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.