తెలంగాణ

telangana

By

Published : May 29, 2022, 1:41 PM IST

ETV Bharat / state

ఏ నీళ్లు తాగేందుకు సురక్షితం?.. జోరుగా సాగుతున్న నీటి దందా..

Water plants Business: ఏ నీళ్లు తాగేందుకు సురక్షితం?.. సర్కారు ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మిషన్ భగీరథ తాగునీరా.. పట్టణాలు, గ్రామాల్లో వీధికొకటి చొప్పున కుప్పలుగా పుట్టుకొస్తున్న ఆర్వో ప్లాంట్ల నీళ్లా.. మిషన్ భగీరథనీళ్లే సురక్షితమని అధికారులు చెబుతుంటే.. ఇప్పటికీ 50శాతానికి పైగా జనం ఆర్వో ప్లాంట్ల నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. కారణం.. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు దారుణంగా విఫలం కావడమే. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు నీటిశుద్ధి కేంద్రాల మీద చర్యలు తీసుకోకపోవడమే. దీనికి తోడు భగీరథ నిర్వహణా లోపాలు ప్రజలను ప్రైవేటు ప్లాంట్ల వైపు మళ్లేలా చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని జోరుగా సాగుతున్న ప్రైవేటు ప్లాంట్ల నీటివ్యాపారంపై ప్రత్యేక కథనం

ఏ నీళ్లు తాగేందుకు సురక్షితం?.. జోరుగా సాగుతున్న నీటి దందా..
ఏ నీళ్లు తాగేందుకు సురక్షితం?.. జోరుగా సాగుతున్న నీటి దందా..

ఏ నీళ్లు తాగేందుకు సురక్షితం?.. జోరుగా సాగుతున్న నీటి దందా..

Water plants Business: మిషన్ భగీరథ ద్వారా పల్లెపట్టణాల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రైవేటు నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణంలోనే 100కు పైగా అనధికారిక ఆర్వో ప్లాంట్లున్నాయి. ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే నీటిని వాహనాల ద్వారా, వీధుల్లో ఏర్పాటు చేసిన 5 రూపాయల ప్లాంట్ల ద్వారా జనం కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇంత జరుగుతున్నా నిబంధనల మేరకు నీళ్లందిస్తున్నారా అంటే అదీ లేదు. నీటి శుద్ధి ప్రక్రియ ఇష్టానుసారం నిర్వహిస్తున్నారు. వచ్చేవి నిజంగానే శుద్ధి చేసిన నీళ్లో కాదో జనానికి తెలియకుండా పోతోంది. డబ్బులు చెల్లించి తీసుకోవడం తప్ప జనం ఏమీ చేయలేకపోతున్నారు. నీటిని ఎక్కడ శుద్ధి చేస్తారు.. ఎలా శుద్ధి చేస్తారు.. ఆ నీళ్లు తాగేందుకు సురక్షితమా అన్న అంశాల్ని ధ్రువీకరించే దిక్కే లేదు. రుచి కోసం కొన్నిరకాల రసాయనాల్ని కలిపి.. నీటికి తీపిదనం వచ్చేలా చేస్తున్నారన్నా ఆరోపణలున్నాయి.

"నిజంగా ఆర్వో వాటర్​ అనేది నిర్జీవ జలం. అందులో ఎలాంటి లవణాలు ఉండవు. ఈ లవణాలు లేకపోవడం వల్ల పీహెచ్​ విలువ తగ్గి ఎసిడిటీ పెరుగుతుంది. మామూలుగా 6.5 నుంచి 8.5 వరకు పీహెచ్​ విలువ ఉండాలి. కానీ ఆర్వో నీటిలో అంత ఉండదు. కాల్షియం అనేది మనకు చాలా అవసరం. ఎముకల పెరుగుదలకు, చిన్నపిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. లవణాలు మానవునికి ఎంతో అవసరం కనుక సమపాళ్లలో వాటిని నీటి ద్వారా పంపిణీ చేయడం జరగుతుంది." -పకీర్‌, మిషన్‌ భగీరథ ఏఈ, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం

అధికారులు విఫలం:మిషన్ భగీరథ నీళ్లు అందుబాటులో ఉన్నా ప్రైవేటు నీటి వ్యాపారం జోరుగా సాగేందుకు అనేక కారణాలున్నాయి. ఆర్వో ప్లాంట్ల నీళ్లు సురక్షితం కాదని చెబుతున్న మిషన భగీరథ అధికారులు.. భగీరథ నీరు సురక్షితమని జనాల నమ్మకం చూరగొనడంలో దారుణంగా విఫలమవుతున్నారు. తరచూ లీకేజీలు, మరమ్మతులకు గురికావడంతో ప్రజలు ప్రైవేటు ప్లాంట్లనే నమ్ముకుంటున్నారు. ఆర్వో ప్లాంట్ల నీటి వ్యాపారంపై మహబూబ్ నగర్ జిల్లా మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరగా.. గ్రామాల్లో ప్రైవేటు ప్లాంట్లను గుర్తించామని, వాటిని మూసివేసేలా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నట్లు చెప్పారు. మున్సిపల్ అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్లాంట్లపై ఆహారకల్తీ అధికారులే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

"నీళ్లు సరిగా రావట్లేదని ప్రజలు ఫిర్యాదు చేయగానే.. వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. ఆర్వో ప్లాంట్లు ఉన్న గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి.. వాటిని మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నాం." -పుల్లారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ మహబూబ్ నగర్

స్పష్టంగా కనిపిస్తోన్న సమన్వయ లోపం: నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఆర్వో ప్లాంట్లపై చర్యలు తీసుకోవడంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించి ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే నీటి శుద్ధి కేంద్రాలను తక్షణం మూసివేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details