శ్రీశైలంకు భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,62,390 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 3,45,054 క్యూసెక్కులుగా నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం.. 884.40 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు.. 212.438 టీఎంసీల వరకు జలాశయంలో నీళ్లు చేరాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగనుంది.
సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో...
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్‌కు ఒక్కసారిగా ఇన్ ఫ్లో పెరిగింది. నిన్న ఉదయం 64 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం... 1,11,310 క్యూసెక్కులకు చేరింది. ఔట్‌ఫ్లో 9,154 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 543.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 195.6975 టీఎంసీలకు చేరింది.
ఒక గేటు నుంచి ప్రారంభమై పది గేట్లతో..
జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. అనంతరం మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా రాత్రి వరకు పది గేట్లు ఎత్తారు. 2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసి మురిసిపోయారు. శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.
జూరాలకు కొనసాగుతోన్న వరద..
జూరాల జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. జూరాలకు 4.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 4,06,604 క్యూసెక్కులుగా ఉంది. 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 6.676 టీఎంసీలకు చేరింది.
ఇవీ చదవండి: