మహబూబ్నగర్లో సోమవారం.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కోయిల్ సాగర్ ఆయకట్టుదారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నుంచి యాసంగికి కుడి, ఎడమ కాలువలకు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మార్చి మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాలని సమావేశం తీర్మానించింది. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం 38 కోట్లు మంజూరు చేశారని, కాలువల పూడికతీత, కంప చెట్లు తొలగింపు, లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
డిసెంబర్ 10 నుంచి మార్చి మొదటి వారం వరకు సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులు అందుకు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. యాసంగి పంట పూర్తయిన వెంటనే ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని, ఫిబ్రవరి నాటికి కావాల్సిన మెటీరియల్ సేకరించాలని మంత్రి సూచించారు. అలాగే సాగునీరు ఉన్నప్పుడు కూడా పనులు చేసేందుకు ఏవైనా అవకాశం ఉంటే పనులు చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఇంజినీర్లను ఆదేశించారు. భవిష్యత్తులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా కోయిల్ సాగర్ ప్రాజెక్టును నింపాలనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడనని... ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.