ఫార్మా కంపెనీ వద్దని గ్రామస్థులు నిరసన చేస్తున్నారు Villagers protest to stop pharma company in Nanjarla : మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం నంజర్ల పారిశ్రామిక వాడలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫార్మా పరిశ్రమ వివాదాస్పదమవుతోంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తెలియకుండా, కనీసం ప్రజాభిప్రాయసేకరణ లేకుండా ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 15 రోజులుగా గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు.
Locals protesting that pollution will increase : నంజర్ల గ్రీన్ జోన్ పారిశ్రామిక వాడలో గ్రీన్, ఎల్లో కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అందులో భాగంగానే ఓ రంగుల తయారీ పరిశ్రమ ఆరేళ్ల పాటు నడిచింది. ప్రస్తుతం ఆ పరిశ్రమ స్థానంలో ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇది రెడ్ కేటగిరి కిందకు వచ్చే పరిశ్రమ అని, ఆ పరిశ్రమ ప్రారంభమైతే వాయు, జల, నేల కాలుష్యాలు మొదలవుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిశ్రమను ఏర్పాటే చేయొద్దంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు.
పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలెపల్లిలోనూ ఫార్మా పరిశ్రమలతో సెజ్ ఏర్పాటైంది. మొదట్లో కాలుష్యం ఉండదని చెప్పి పారిశ్రామిక వర్గాలు హామీ ఇచ్చాయి. ఆ తర్వాత అక్కడ ఏర్పడిన కాలుష్యంపై హరిత ట్రిబ్యూనల్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. పరిహారం చెల్లించాలంటూ తీర్పులు సైతం ఇచ్చాయి. నంజర్ల పారిశ్రామిక వాడలోనూ అదే పునరావృతం అవుతుందని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. పారిశ్రామిక వాడలో ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తమకు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని, తమ పరిశ్రమ వల్ల కాలుష్యం ఉండబోదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అనవసరంగా స్థానికులు ఆందోళనకు గురికావద్దని.. పరిశ్రమ ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని అంటున్నారు.
"ఫార్మా కంపెనీ ఉన్న ప్రదేశంలో రంగుల తయారీ పరిశ్రమ ఉండేది. మాకు తెలియకుండానే దాన్ని అంతర్గతంగా ఫార్మా కంపెనీగా మార్చేశారు. బయట టవర్స్ ఎందుకు పెడుతున్నారని చూస్తే.. అప్పుడు అర్ధమైంది అది మెడికల్ కంపెనీ అని. మాకు ఇలాంటి కంపెనీలు వద్దని చెబుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే నిరసన తెలియజేస్తున్నాం."- స్థానికుడు
ఇవీ చదవండి :