తెలంగాణ

telangana

ETV Bharat / state

'గత సంవత్సరం కన్నా ఎక్కువ మొక్కలు పెంచాలి' - తెలంగాణకు హరితహారం తాజా

నర్సరీల పెంపకంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. బ్యాగుల్లో మట్టి నింపటం, విత్తనాలు నాటడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణకు హరితహారం నర్సరీలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

video conference held with the collectors of all the districts on telanganaku harithaharam
'గత సంవత్సరం కన్నా ఎక్కువ మొక్కలు పెంచాలి'

By

Published : Dec 12, 2020, 10:55 PM IST

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నర్సరీల్లో.. గత సంవత్సరం కన్నా ఎక్కువ మొక్కలు పెంచాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు. హరితహారం నర్సరీలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రత్యేక దృష్టి:

నర్సరీల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. బ్యాగుల్లో మట్టి నింపటం, విత్తనాలు నాటడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు. ప్రత్యక్షంగా నర్సరీలను తనిఖీ చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని.. అందులో వాకింగ్ ట్రాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏడు రిజిస్టర్లు సిద్ధంగా ఉండాలి:

నర్సరీల్లోని మొక్కలు కనీసం రెండు మీటర్లు పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ కోరారు. నాటిన మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులు అక్కడక్కడా పడిపోయాయన్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించి అలాంటివాటిని సరిచేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులను కేంద్ర బృందం ఆకస్మికంగా తనిఖీలు చేస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఏడు రిజిస్టర్లు సిద్ధంగా ఉంచేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధిహామీ పనులు జరిగే చోట వర్క్ సైట్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.

రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు:

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మహబూబ్​నగర్ జిల్లాలో మొక్కలు పెంచుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు వివరించారు. మార్చి నుంచి హరితహారం చెల్లింపులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేయగా.. స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: గ్రనేడ్ల కలకలం: ఏ చెట్టు కింద ఏ బాంబు ఉందో!

ABOUT THE AUTHOR

...view details