కరోనాతో వాహన తయారీ తగ్గింది.. కొనుగోలు పెరిగింది రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ మినహాయింపులతో ప్రజా రవాణా తిరిగి ప్రారంభమైంది. కానీ.. జనం మాత్రం అటువైపు చూసేందుకు ఇష్టపడటం లేదు. కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ప్రజా రవాణాకు దూరంగా ఉండటమే మేలని భావిస్తున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. తాజాగా పెరిగిన వ్యక్తిగత వాహనాల అమ్మకాలే ఇందుకు నిదర్శనం.
50 శాతానికి పైగా...
గత నెల 12 నుంచి వాహన విక్రయాలు ప్రారంభంకాగా... నెల రోజుల్లో ఏకంగా 50 శాతానికి పైగా లావాదేవీలు కొనసాగాయి. గతేడాదితోపాటు లాక్‌డౌన్ కంటే ముందు కేవలం 35 శాతంగా ఉన్న వాహన విక్రయాలు... ఇప్పుడు ఏకంగా 70 శాతం మించిపోయాయి. బీఎస్- 6 పరిమాణాలతో ధరలు పెరిగినా... వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
3 నెలల మారటోరియం...
కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రుణాలకు బ్యాంకులు 3 నెలల మారటోరియం కల్పిస్తున్నాయి. బ్యాంకులు, పైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు పొంది వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపెడుతున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత వాహన రుణాల విభాగంలో కదలిక రావడం వల్ల బ్యాంకింగ్ రంగానికి సైతం మేలు జరుగుతోంది.
10 శాతం ధర పెరిగినా...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా 7,727 ద్విచక్ర వాహనాల విక్రయాలు జరగగా... వాటి ద్వారా రూ. 62 కోట్ల వ్యాపారం జరిగింది. ఇదే సమయంలో 261 కార్లను వివిధ కంపెనీలు విక్రయించగా... వాటి ద్వారా మరో రూ. 22 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో కేవలం బీఎస్- 6 వాహనాల అమ్మకాలే జరుగుతున్నాయి. ఆ వాహనాల ధరల బీఎస్- 4 ధరలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఉన్నాయి. అయినా వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం విశేషం.
ఇవీ చూడండి:సైనికుల త్యాగం వృథా కాదు.. ప్రతీకార చర్య తప్పదు: బండి సంజయ్