ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. 5 జిల్లాల వ్యాప్తంగా 17 కేంద్రాల్లో జరిగిన టీకా పంపిణీలో ఆన్లైన్లో నమోదు చేసుకుని కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి టీకా ఇచ్చి ఇంటికి పంపారు. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాక్సినేషన్ ప్రారంభించగా... కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, భూత్పూరు, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
29 మందికే...
జడ్చర్లలో 30 మందికి గాను 29 మందికే వాక్సినేషన్ చేశారు. ఒకరు గర్భిణీ కావడం వల్ల హాజరు కాలేదు. నారాయణపేట జిల్లాలో టీకా పంపిణీలో ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతమైనట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా కేంద్రాన్ని శాసనసభ్యుడు ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొదటి విడతలో జిల్లాకు 1,040 వాయిల్స్ వచ్చాయని వీటిని ఫ్రంట్లైన్ వర్కర్లకు ఇస్తామని చెప్పారు. టీకా సురక్షితమైనదని, ఎలాంటి సమస్యలు రావని ధైర్యంగా టీకా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.